Monday, June 29, 2015

ప్రేయసిపై సామూహిక అత్యాచారం, అయినా పెళ్లాడాడు

ప్రేయసిపై సామూహిక అత్యాచారం, అయినా పెళ్లాడాడు



హైదరాబాద్: తనపై విశ్వాసంతో వచ్చి కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి ప్రియుడు చేయి అందించాడు. జీవితాంతం తోడుగా ఉంటానంటూ పెద్దల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆదర్సంగా నిలిచిన ఆ యువకుడు కొల్లూరు గ్రామానికి చెందిన మున్నంగి రాజేశ్‌ కాగా ఆ యువతి శనివారం రాత్రి సామూహిక అత్యాచారానికి గురైన యువతి. 
ఈ ఆదర్శ వివాహం గుంటూరు జిల్లా కొల్లూరులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన యువతిపై శుక్రవారం అర్ధరాత్రి ఆర్మీ ఉద్యోగి సహా నలుగురు యువకులు పోలీసుల పేరుతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. వాస్తవానికి, కొల్లూరు గ్రామానికి చెందిన ఆ యువతి, మున్నంగి రాజేశ్‌లవి పక్క పక్క ఇళ్లే. ఆ యువతికి తల్లీ తండ్రి ఇద్దరూ లేరు. రాజేశ్‌కు తండ్రి ఉన్నాడు. కానీ తల్లి లేదు. 
                                                                   ప్రేయసిపై సామూహిక అత్యాచారం, అయినా పెళ్లాడాడు

కొంత కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి వేమూరు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రేమ జంటను బెదిరించి యువతిని బలవంతంగా తీసుకెళ్లిన కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయినా రాజేశ్‌ ఆమెను వదిలిపెట్టలేదు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. బాధిత యువతి కూడా ఇందుకు అంగీకరించింది. 
ఈ విషయంలో ఉభయుల పెద్దలు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని సంప్రదింపులు జరిపారు. అందరి ఆమోదం లభించండంతో ఆదివారం సాయంత్రం కొల్లూరులోని టౌన్‌ చర్చిలో వీరికి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. తాను ప్రేమించిన యువతి మెడలో రాజేశ్‌ తాళి కట్టాడు. 
రాజేశ్‌ ఆదర్శాన్ని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తదితరులు అభినందించారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన వారిలో రేపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి రాతంశెట్టి సుధాకర్‌తోపాటు అడుసుమిల్లి వెంకటేశ్వరరావును ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. గోపి, భూపతి వెంకటరత్నం కోసం గాలిస్తున్నారు.

No comments:

Post a Comment