ఇండియాలో తొలి బస్సు తిప్పింది మనమే… బెజవాడ to మచిలీపట్నం
ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగినా మొదటి అడుగు ఎప్పుడూ ముచ్చటగానే ఉంటుంది. అందుకే చరిత్ర గుర్తొస్తే ఆంధ్రా పులకరిస్తోంది. ఇదీ మన తడాఖా అంటూ మీసం మెలేస్తోంది. స్కైబస్ వస్తోందని… నీళ్లలోనూ రోడ్ల మీదే తిరిగే టూరిజం ఎట్రాక్షన్స్ వస్తాయని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాం. నిజానికి ఇలాంటి అద్భుతాలు మనం వందేళ్ల కిందటే చూపించామని చరిత్ర చెబుతోంది. ఆశ్చర్యపరుస్తోంది. ఇండియాలోనే తొలిసారిగా తిరిగిన బస్సు, కార్లకి మన రోడ్లే దారి చూపించాయ్. ఇవి మేడిన్ ఇండియా తొలి ఆవిష్కరణలు. జేఆర్ డీ టాటా లాంటి వాళ్లు అప్పటికే విదేశీ టెక్నాలజీ దిగుమతి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నా.. ఇవి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో చేసినవి. అందుకే ఇవి మన ల్యాండ్ మార్క్స్.
1903లో సిమ్సన్ అండ్ కంపెనీ కోసం శామ్యూల్ జాన్ గ్రీన్ ఆవిరితో తిరిగే కారు నడిపించారు. ఇండియాలో ఇదే ఫస్ట్ మోటార్ వెహికిల్. అప్పట్లో రోడ్ల మీద అదో సంచలనం. కొత్త ఇండస్ట్రీ మొదలైంది… ఇదో చరిత్ర అంటూ మద్రాస్ మెయిల్ పొడగ్తలతో ముంచెత్తింది అప్పట్లో ! రెండేళ్ల తర్వాత సిమ్సన్ ఆవిరితో నడిచే బస్సును కూడా ఆవిష్కరించారు. బెజవాడ మచిలీపట్నం మధ్య తిరిగింది ఇది. ఇది ఇండియాలో తిరిగిన తొలి బస్సుగా రికార్డు సృష్టించింది. లండన్ మ్యూజియంలో ఇప్పటికీ దీని నమూనా ఉంది. అప్పట్లో మచిలీ పట్నాన్ని నోరుతిరగక… బ్రిటీష్ వాళ్లు మసులీపట్నం అనేవాళ్లు. ఇప్పటికీ అవే బోర్డులు ఉంటాయ్ చాలా చోట్ల. బందరు చుట్టుపక్కల.
తొలి బస్సు తిరిగిన కొన్నాళ్లకే బెజవాడలో ట్రైవెల్స్ మొదలయ్యాయ్. ఇప్పుడు నడుస్తున్న కేసినేని లాంటి ట్రావెల్స్ కి పునాది పడింది అప్పుడే ! 1928 లోనే కేసినేని వెంకయ్య ట్రావెల్స్ తిప్పిన తొలి వాణిజ్యవేత్తగా ఆశ్చర్యపరిచారు. ఇంచుమించు ఇండియాలో ఇదికూడా రికార్డే. అప్పట్లోనే నడపడం కాదు… ఇప్పటికీ కొనసాగడం ఈ ట్రావెల్స్ ప్రత్యేకత. చరిత్ర ఇది. ఇది కళ్లతో చూసినవాళ్లు ఇపుడు మన మధ్య లేరు. మనకా ఆసంగతి తెలియదు. ఎందుకంటే… మన ఘనత మనకి తెలియదు. పట్టించుకోం కదా ! ఇప్పటికైనా తెలుసుకుందాం..ఇలాంటివి మైలురాళ్లుగా ఆంధ్రా ప్రయాణంలో కనిపిస్తాయ్ అని గుర్తిద్దాం ! గర్విద్దాం !!
No comments:
Post a Comment